(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలు, అలసత్వంతో దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. ఉన్నత చదువులు చదివినప్పటికీ, ప్రతిభకు తగిన కొలువు రాకపోవడంతో యువత నైరాశ్యంలో కూరుకుపోతున్నది. మరోవైపు, కృత్రిమ మేధ (ఏఐ) విజృంభణతో ఐటీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. మొత్తంగా దేశంలో ఉద్యోగ సంక్షోభం ముదిరింది. వీటిని కప్పిపుచ్చేందుకు ‘రోజ్‌గార్ మేళా’ పేరిట ప్రభుత్వం అట్టహాస ప్రచారాలకు తెగబడుతున్నదే గానీ, ఉద్యోగ కల్పనకు మాత్రం పూనుకోవడంలేదు. దీంతో మోదీ ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో నిరుద్యోగ తీవ్రత మరింత పెరిగింది. ఉన్నత చదువులు చదువుకొన్న యువతకు కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. ఈ మేరకు పాలసీ సర్కిల్ ఓ కథనంలో వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత రేటు 7.4 శాతంగా ఉన్నది. మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెచ్చరిల్లిందనడానికి తాజా గణాంకాలే నిదర్శనమని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.
అర్హతకు తగిన ఉద్యోగం కోసం యువత ఏండ్లుగా ఎదురుచూస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి తగిన సహాయ, సహకారాలు అందట్లేదని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పలు శాఖల్లో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ, గడచిన 11 ఏండ్లలో వీటిని భర్తీ చేయాలన్న ఆలోచనను మోదీ ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువశక్తి నిర్వీర్యమైపోతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ సంక్షోభం తీవ్రతరమవుతున్నది. కృత్రిమ మేధ (ఏఐ) రాకతో టెక్ ఇండస్ట్రీలో ప్రారంభమైన కుదుపులు ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. 2023, 2024లో దాదాపు 25 వేల మంది టెకీలు భారత్‌లో ఉద్యోగాలు కోల్పోయారు. నిరుడు 50 వేల టెకీలకు ఉద్వాసన పలికినట్టు నివేదికలను బట్టి అర్థమవుతున్నది.
ఉద్యోగులను వదిలించుకునేందుకు ఐటీ కంపెనీలు రకరకాల కారణాలు వెతుకుతున్నాయి. అందులో ‘నాసిరకం పనితీరు’ కూడా ఒకటి. ఈ కారణంగా ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు ఇవ్వకపోవడమో, లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనో ఉద్యోగులను కోరుతున్నాయి. గత ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగులను రహస్యంగా పెద్ద సంఖ్యలో తొలగించినట్టు హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సీఈవో ఫిల్ ఫెర్స్ట్ పేర్కొన్నారు. అతిపెద్ద కంపెనీలైన టీసీఎస్, యాక్సెంచర్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించాయి. అమెజాన్ కూడా ఈ వరుసలో చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి మరో 12 వేల మంది ఉద్యోగులను వదిలించుకోవాలని టీసీఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అంటే కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది దాదాపు రెండు శాతం. యాక్సెంచర్ నిరుడు జూన్-ఆగస్ట్ మధ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అమెజాన్ కూడా 16 వేల మందికి పింక్ స్లిప్‌లను జారీ చేసింది. కాగా, హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనలు కూడా సాంకేతిక రంగంలో కొలువుల కోతకు ఒక కారణంగా నిపుణులు చెప్తున్నారు. టెక్ సెక్టార్లోనే కాకుండా ఫైనాన్స్, ఫార్మా రంగాల్లోనూ వందలాది మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు నివేదికలను బట్టి అర్థమవుతున్నది.
స్వదేశంలో ప్రభుత్వం పట్టించుకోలేదు.. విదేశాల్లోనైనా ఉద్యోగాలు చేద్దామనుకొంటే మోదీ దౌత్య వైఫల్యంతో భారత విద్యార్థులకు అదీ సాధ్యం కావట్లేదు. హెచ్1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు కూడా భారతీయ విద్యార్థులపై ఆంక్షలను ముమ్మరం చేశాయి.
దీంతో విదేశీ ఉద్యోగాలు చేద్దామనుకొనే ఉద్యోగార్థుల ఆశలు అడియాశలుగా మారాయి. స్వదేశంలోనైనా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేద్దామనుకొనే యువతకు అదీ అశనిపాతంలాగే మారింది. కేంద్రం నుంచి తగిన ప్రోత్సాహకాలు లేకపోవడంతో గడచిన 11 ఏండ్లలో 6.83 లక్షల కంపెనీలకు తాళాలు పడ్డాయి. అర్హతకు తగిన ఉద్యోగాలు లభించక దాదాపు 22 కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు తేల్చి చెప్పాయి.