Crime news : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ (Prayagraj) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి సామూహిక హత్యల (Family Massacre) కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలకు కారణంగా అత్యాశ, నమ్మకద్రోహమేనని నిర్ధారించారు. ఇంట్లో ఉన్న రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాల కోసం ఓ కొడుకు తన స్నేహితుడితో కలిసి తల్లిదండ్రులను, తోబుట్టువును దారుణంగా చంపాడు. ఆ తర్వాత లూటీ చేసిన సొమ్ము పంపకాల విషయంలో గొడవ జరిగి స్నేహితుడి చేతిలో హత్యకు గురయ్యాడు. ప్రయాగ్రాజ్లోని సౌత్ మలకా (South Malaka) ప్రాంతంలో ఆదివారం (Sunday) ఈ హత్యలు జరుగగా.. మంగళవారం (Tuesday) వెలుగులోకి వచ్చాయి. ఈ సామూహిత హత్యలు స్థానికంగా సంచలనం రేపాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 70 ఏళ్ల వీరేంద్ర వైశ్య తన భార్య అనితా వైశ్య (60), కుమార్తె మీనాక్షి వైశ్య (40), కుమారుడు అభిషేక్ వైశ్య (38) తో కలిసి సౌత్ మలాకాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆస్తి పంచాలంటూ కొడుకు అభిషేక్ వైశ్య.. తండ్రి వీరేంద్ర వైశ్యతో గొడవ పడుతున్నాడు. అయితే ఆస్తిని పంచిఇచ్చేందుకు వీరేంద్ర నిరాకరించాడు. గొడవ కారణంగా కొడుకును ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దాంతో అభిషేక్ వైశ్య కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. పైగా ఇంట్లో ఉన్న రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించి జల్సా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ విషయం స్థానికంగా సమోసాలు అమ్ముకునే తన స్నేహితుడు సన్నీ గుప్తా (35) కు చెప్పి హత్యలకు ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం ఆదివారం హత్యలకు ముందు ఇద్దరూ కలిసి అభిషేక్ వైశ్య ఇంటికి సమీపంలోని అతడి దుకాణంలో మద్యం సేవించారు. అనంతరం ఇద్దరూ ఇంట్లో చొరబడి వీరేంద్ర వైశ్యను, అనితా వైశ్యను, మీనాక్షి వైశ్యను చంపేశారు. అనంతరం తిరిగి దుకాణానికి వచ్చి దొంగిలించిన సొమ్మును పంచుకునే ప్రయత్నం చేశారు. అయితే వాటాల లెక్క కుదరక ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో స్నేహితుడు సన్నీ గుప్తా.. అభిషేక్ వైశ్యను తలపై రాడ్డుతో బలంగా కొట్టి హతమార్చాడు. లూటీ సొమ్ము మొత్తం ఎత్తుకుని, దుకాణానికి తాళం వేసి పారిపోయాడు.
అయితే మంగళవారం వీరేంద్ర గుప్తా ఇంటి నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి చూడగా.. వీరేంద్ర వైశ్య, అతడి భార్య, కుమార్తె విగతజీవులుగా పడివున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నడాని స్థానికులు చెప్పడంతో పోలీసులు ఇంటి సమీపంలోని వీరేంద్ర వైశ్య దుకాణం తాళాలు పగులగొట్టి తెరిచారు. అందులో వీరేంద్ర కుమారుడు అభిషేక్ వైశ్య రక్తపు మడుగులో పడివున్నాడు. ఒకే కుటుంబంలో నలుగురు హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే మిస్టరీని చేధించారు. నిందితుడు సన్నీ గుప్తాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.