Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ లో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దారుణానికి పాల్పడ్డాడు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, మూత్రంపోసి, దుస్తులు ఊడదీసి, దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అంకుర్ రాజ్ తివారి ఈ నేరానికి పాల్పడ్డట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన కొత్వాలి ఖలిలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి 11.00 గంటల సమయంలో జరిగింది.
బాధిత వ్యక్తికి, ఎమ్మెల్యేకు మధ్య కొంతకాలంగా ఒక భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. లక్నోలో ఒక ప్రాపర్టీని తన పేరున రిజిష్టర్ చేసే విషయంలో ఎమ్మెల్యేకు, బాధితుడికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో బాధితుడిని శుక్రవారం రాత్రి కిడ్నాప్ చేశారు. అతడు ఒక డిన్నర్ కు వెళ్లి తిరిగి వస్తుండగా.. రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన దుండగులు.. అతడిని కిడ్నాప్ చేసి గోరఖ్ పూర్, సహ్జన్వా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే సోదరుడు తన అనుచరులతో కలిసి బాధిత వ్యక్తిపై దాడి చేశారు. దుస్తులు ఊడదీసి, మూత్రం పోశారు. ఒంటిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మొత్తాన్ని ఎమ్మెల్యే వీడియో కాల్ లో చూశాడని బాధితుడు ఆరోపించాడు.
సవాన్ తివారి అనే వ్యక్తి దీన్ని మొత్తం వీడియో చిత్రీకరించాడు. ఈ దాడిపై బాధితుడు, అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఎనిమిది మంది వరకు దాడి చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.