GPS | బరేలీ(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని రామ్గంగ నదిలో ఆదివారం కారు పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. సురక్షితం కాని మార్గంలో వెళ్లేలా డ్రైవర్‌ను జీపీఎస్ తప్పు దారి పట్టించడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బరేలీ జిల్లాలో పట్టపగలు 10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ‘ఈ ఏడాది మొదట్లో వరదల వల్ల వంతెన ముందు భాగం నదిలో కూలిపోయింది. కానీ ఈ మార్పును జీపీఎస్ మార్గ వ్యవస్థలో సవరించలేదు’ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ అశుతోశ్ శివమ్ తెలిపారు.
జీపీఎస్ నావిగేషన్‌ను ఉపయోగిస్తున్న డ్రైవర్‌కు వంతెన సురక్షితం కాదన్న విషయం తెలియక కారును వంతెన దెబ్బ తిన్న భాగం నుంచి పోనిచ్చాడని పోలీసులు తెలిపారు. వంతెన ముందు ఎలాంటి బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం ఈ ప్రమాదానికి దారి తీసిందన్నారు. కారును, ముగ్గురి మృతదేహాలను నది నుంచి వెలికి తీశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది.