లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 312 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఈసారి దాదాపు 50 స్థానాలను కోల్పోయేలా ఉన్నది. మధ్యాహ్నం 12 గంటల వరకు బీజేపీ 272 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. బీజేపీ కోల్పోయిన స్థానాలు ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ ఖాతాలో చేరాయి.
గత ఎన్నికల్లో 52 స్థానాలకు పరిమితమైన ఎస్పీ కూటమి ఈ ఎన్నికల్లో 120 స్థానాలకుపైగా సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ స్థానం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అక్కడి నుంచి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి కుల్దీప్ నారాయణ్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ మూడో స్థానంలో ఉన్నారు.