బరేలీ(యూపీ): లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించి వ్యాఖ్యలు చేసినందుకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి జనవరి 7న హాజరుకావాలని ఆదేశిస్తూ స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది. జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి శనివారం రాహుల్ గాంధీకి సమన్లు జారీచేశారు. అఖిల భారత హిందూ మహాసంఘ్ మండల అధ్యక్షుడు పంకజ్ పాఠక్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ సమన్లు జారీ అయ్యాయి. రాహుల్పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఆగస్టులో ఎమ్మెల్యేఎంపీ కోర్టు/సీజేఎం కోర్టును పాఠక్ తొలుత ఆశ్రయించారు.
అయితే ఈ దరఖాస్తును కోర్టు ఆగస్టు 27న తిరస్కరించడంతో ఆయన సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా ఇప్పుడు అదే కోర్టు రాహుల్కు సమన్లు జారీచేసింది. లోక్సభ ఎన్నికల ప్రచార సందర్భంగా రాహుల్ గాంధీ ఆర్థిక సర్వేను ప్రస్తావిస్తూ దేశంలో బలహీన వర్గాల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు సంపాదించుకున్న ఆస్తులు మాత్రం చాలా తక్కువని అన్నారని పాఠక్ తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది వీరేంద్ర పాల్ గుప్తా అన్నారు. కులాల మధ్య విద్వేషాలను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది రాహుల్ ఆలోచనని ఆయన ఆరోపించారు.