న్యూఢిల్లీ, ఆగస్ట్ 6: ఉపఖండంలోని దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మయన్మార్, నేపాల్ తాజాగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు.. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా భారత్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దేశం చుట్టూ నెలకొన్న పరిస్థితులు భారత విదేశాంగ విధానానికి సవాలు విసరడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈక్రమంలో భారత్ ఉపఖండంలో పెద్దన్న పాత్ర పోషించి శాంతి, సుస్థిరత కోసం కృషి చేయాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
బంగ్లాదేశ్: గత పదిహేనేండ్లలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకున్నది. నీరు, మానవ వనరులు సమృద్ధిగా ఉన్న బంగ్లాదేశ్‌లో పలు బహుళజాతి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో 1994-2023 మధ్య కాలంలో బంగ్లాదేశ్ 5.8% వృద్ధిరేటును నమోదుచేసింది. ఓ వైపు దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుండగా.. అదే స్థాయిలో మతోన్మాదం, అరాచకత్వం పెనుముప్పుగా తయారయ్యాయి. చివరికి జమాతే ఇస్లామీ వంటి అతివాద శక్తులు ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలదోయడంలో సఫలమయ్యాయి.
శ్రీలంక: కొవిడ్ ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోగా అధిక ద్రవ్యోల్బణం, జీడీపీ పతనం ఆ దేశాన్ని తీవ్రంగా కుంగదీశాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో మహింద రాజపక్స ప్రభుత్వం విఫలమైంది. దేశంలో తీవ్రస్థాయిలో చెలరేగిన హింస, అస్థిరత నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజపక్స ట్రింకోమలై నౌకాశ్రయానికి పారిపోయి తలదాచుకున్నారు.
పాకిస్థాన్: రెండేండ్ల క్రితం ఏప్రిల్‌లో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అర్థంతరంగా తన పదవి నుంచి వైదొలిగారు. అప్పటినుంచి పాకిస్థాన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత, సామాజిక, రాజకీయ సంక్షోభంతో పాక్ కోలుకోలేని స్థితికి దిగజారిపోయింది. దీంతో ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ఉగ్రవాదం, తిరుగుబాట్లు పెచ్చుమీరుతున్నాయి.
అఫ్గానిస్థాన్: ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, దేశమంతటా పేదరికం విస్తరించడంతో అఫ్గానిస్థాన్ సైతం తీవ్రమైన రాజకీయ, సామాజిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2021 ఆగస్టులో అమెరికా దళాలు ఆకస్మికంగా వైదొలగడంతో దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో రెండు దశాబ్దాల పాటు ఆ దేశ పౌరులు అనుభవించిన విద్యా, పౌర, మహిళా హక్కులను తాలిబన్లు అణచివేశారు. ఇస్లామిక్ చట్టాలను కఠినాతి కఠినంగా అమలు చేస్తుండడంతో దేశంలో లక్షల మంది పౌరులు తీవ్రమైన ఆహార, వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నారు.
మయన్మార్: భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అత్యంత కల్లోలంగా ఉన్న ప్రదేశం మయన్మార్. అధికార జుంటా (సైనిక పాలకులు) పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతుండగా, తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడుతుండటంతో దేశంలో అంతర్యుద్ధం ఉచ్ఛస్థితికి చేరింది. దీంతో అక్కడి పౌరులు శరణార్థులుగా మన దేశంలోని మిజోరం, మణిపూర్ రాష్ర్టాలకు తరలివస్తున్నారు.