Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అధికారమే పరమావధి. దీని కోసం ఎన్ని హామీలైనా గుమ్మరించాలి. అర్హులు ఎవరు? ఎవరు కాదు? అనేది తర్వాత ముచ్చట. గ్యారెంటీలు అమలు చేయగలమా? లేదా? అనే చర్చ వద్దేవద్దు. ముందు ఓటర్లను ఆకర్షించాలి. ఉచిత పథకాలతో మురిపించాలి. అధికారంలోకి రావాలి.
తీరా.. అధికారంలోకి వచ్చాక.. నిధుల కటకట మొదలవుతుంది. అనాలోచితంగా ప్రకటించిన హామీలతో రాష్ర్టాలకు రాష్ర్టాలే దివాలా తీసే దుస్థితి దాపురిస్తుంది. నిన్న హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు పంజాబ్, కర్ణాటకలో పరిస్థితులను చూస్తే ఇదే విషయం అర్థమవుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిన ఉచిత స్కీమ్‌లను ఫాలో అయిన కాంగ్రెస్ పార్టీ.. ఐదు గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది.
అయితే, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే దారి లేక ఇప్పటికే పలు గ్యారెంటీల్లో కోతలు పెట్టింది. ప్రజలపై పన్నుల భారం మోపింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ. 25 వేల కోట్ల బకాయిలను కూడా చెల్లించట్లేదు. ఇక, ఎన్నికల ముందు 10 గ్యారెంటీలతో ఆశ పెట్టి హిమాచల్‌లో అధికారంలోకి వచ్చిన అదే కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు హామీలకు, సబ్సిడీలకు కత్తెర పెట్టే పనిని ప్రారంభించింది.
తొలుత ఉచితాలతో మభ్యపెట్టిన పంజాబ్‌లోని ఆప్ సర్కారుకు కూడా ఈ సెగ తగిలింది. పర్యావసనంగా ఇప్పుడు ఆ రాష్ట్రమే దివాలా తీసే ప్రమాదం ఏర్పడింది. దీంతో సబ్సిడీల్లో కోత పెట్టడమే కాకుండా.. పన్నుల వాతకు ఆ సర్కారు శ్రీకారం చుట్టింది.
పెరుగుతున్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ సర్కారు కోతల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. విద్యుత్తు సబ్సిడీలో కోత, పెట్రో పన్నుపై వాతతో ప్రజలపై భారాన్ని మోపేందుకు నిర్ణయించింది. పెట్రోల్‌పై 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు వ్యాట్‌ను విధించిన భగవంత్ మాన్ ప్రభుత్వం.. గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్తు పథకాన్ని ఉపసంహరించుకొన్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరినాటికి పంజాబ్ అప్పులు రూ. 3.74 లక్షల కోట్లకు చేరుతాయని బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి సబ్సిడీల్లో కోత, పన్నుల పెంపును ఓ మార్గంగా చూస్తున్నది.
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో.. ఆరు గ్యారెంటీల ఆర్భాటంతో తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్‌కు అసలు తత్వం ఇప్పుడు బోధ పడుతున్నది. గ్యారెంటీల అమలు కర్ణాటకపై పెను ఆర్థిక భారాన్ని మోపింది. దీంతో ధరలు పెంచి, ఖజానా నింపేందుకు సిద్ధరామయ్య సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మరోవైపు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.25 వేల కోట్ల మేర బిల్లులను ఆలస్యం చేయడంతో అభివృద్ధి పనులకు ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీల అమలును మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకటి, రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని సర్కారు చెప్తున్నప్పటికీ లబ్ధిదారులు అందరికీ అందడం లేదన్నది బహిరంగ రహస్యమే.
2022 చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు హిమాచల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 గ్యారెంటీలు ప్రకటించింది. 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పాత పింఛన్ విధానం అమలు వంటి అనేక హామీలు ఇచ్చింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ హామీలను అమలు చేసే స్థితిలో లేదు. రాష్ట్రం మొత్తం అప్పులే రూ. 86,589 కోట్లకు చేరాయి. ఇదేమీ పట్టించుకోకుండా ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు ఇప్పుడు హామీలకు, ఏకంగా 14 సబ్సిడీలకు కత్తెర పెట్టే పనిని ప్రారంభించింది.