జమ్మూ/శ్రీనగర్, న్యూఢిల్లీ, ఆగస్టు 28: జమ్ము ప్రాంతంలో గడచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించడంతోపాటు 41 మందిని బలిగొన్నాయి. మంగళ, బుధవారాలలో రియాసీ, దోడా జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి 41 మంది మరణించారు. వీరిలో అత్యధికులు వైష్ణోదేవి యాత్రికులే. మంగళవారం మధ్యాహ్నం అద్కున్వారీ సమీపంలో వైష్ణోదేవి యాత్రా మార్గంలో సంభవించిన మేఘ విస్ఫోటం వల్ల ముంచెత్తిన ఆకస్మిక వరదల్లో 34 మంది మరణించారు.
అదే రోజున ఉదయం దోడా జిల్లాలో వచ్చిన ఆకస్మిక వరదలకు నలుగురు మరణించారు. మరణించిన 34 మందిలో 18 మంది మృతదేహాలను జమ్ములోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానకు తరలించగా వీరిని పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వాసులుగా గుర్తించారు. కాట్రాలోని దవాఖానను సందర్శించిన జమ్మూ కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ మిశ్రా గాయపడి చికిత్స పొందుతున్న 13 మంది ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల చొప్పున పరిహారాన్ని అందచేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా అనేకచోట్ల కొండ చరియలు విరిగిపడడంతో చండీగఢ్-కులూ హైవేపైన 50 కిలోమీటర్ల పొడవునా భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ -ఎన్సీఆర్కి పండ్లు, కూరగాయలను తీసుకువెళుతున్న వందలాది ట్రక్కులతోసహా వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలీ హైవేపైన అనేక చోట్ల అడ్డంకులు ఏర్పడడంతో వాహన ప్రయాణికులు గంటల కొద్దీ రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.