న్యూఢిల్లీ : ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా జీవిత ఖైదును అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు శిక్షను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పున కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు వెలుపల శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. రేపిస్టులకు రక్షణలు కల్పించడాన్ని ఖండిస్తూ ప్లకార్డులు, నినాదాలతో కోర్టు ప్రాంగణం సమీపంలో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి మద్దతుగా నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలలో ఐద్వాకు చెందిన సభ్యులతోపాటు సామాజిక కార్యకర్త యోగితా భావన, బాధితురాలి తల్లి తదితరులు పాల్గొన్నారు. తన కుమార్తె చాలా కష్టాలను ఎదుర్కొందని, ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడానికే తాను వచ్చానని బాధితురాలి తల్లి మీడియాకు తెలిపారు.
తాను న్యాయవ్యవస్థను మొత్తంగా విమర్శించడం లేదని, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు న్యాయవ్యవస్థపై తమ కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీశాయని ఆమె చెప్పారు. గతంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు తమ కుటుంబానికి న్యాయం చేయగా దోషికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు తమకు అన్యాయం చేసిందని ఆమె అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని, అత్యున్నత న్యాయస్థానంపై తమకు విశ్వాసం ఉందని ఆమె తెలిపారు. బీజేపీ బహిష్కృత నాయకుడు సెంగార్‌పై 2019 డిసెంబర్లో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు దోషికి బెయిల్ మంజూరు చేస్తూ గత మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ శుక్రవారం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.