హిసార్, మే 18: బ్రహ్మచారులకు, భార్యను పోగొట్టుకున్న వారికి పింఛన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన పార్టీలకే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామని హర్యానాలోని బ్రహ్మచారుల సంఘం స్పష్టం చేసింది. 40 ఏండ్లు దాటిన బ్రహ్మచారులందరూ కలిసి సమస్త అవివాహిత పురుష సమాజం పేరుతో 2022లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
రాష్ట్రంలోని బ్రహ్మచారులు, భార్యను పోగొట్టుకున్న వారు ఏడు లక్షల మంది సభ్యులుగా ఉన్న ఈ సంఘం వారి తరఫున ఒక ప్రకటన చేస్తూ తమకు తప్పనిసరిగా పింఛన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. కాగా, 2014 ఎన్నికల్లో వీరు తమకు పెండ్లి కూతురును తెచ్చే వారికే ఓటు వేస్తామని పేర్కొన్నారు. 45-60 ఏండ్ల అవివాహిత స్త్రీ, పురుషులకు రూ.2,750 పెన్షన్ పథకాన్ని హర్యానా ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టింది. అయితే ఒకరిద్దరికి తప్ప తమలో అన్నివిధాలుగా అర్హులైన చాలా మందికి ఈ పథకం అందలేదని బ్రహ్మచారుల సంఘం ఆరోపించింది.