న్యూఢిల్లీ: ఎల్పీజీ సిలిండర్ల ఈ-కేవైసీ ధ్రువీకరణకు కాల పరిమితి లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మంగళవారం స్పష్టం చేశారు. కేరళ విపక్ష నేత సతీశన్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన లేఖకు ప్రతిస్పందనగా ఈ విషయాన్ని వెల్లడించారు. వాణిజ్య సిలిండర్ల అక్రమ బుకింగ్‌ను నిరోధించి, బోగస్ ఖాతాలను తొలగించడం కోసమే ఈ-కేవైసీ ధ్రువీకరణ చేపట్టామన్నారు. ఓఎంసీ యాప్ ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ షో రూమ్‌లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపారు.
హిందీలో బీటెక్
న్యూఢిల్లీ, జూలై 9: కొత్త అకడమిక్ సెషన్ నుంచి హిందీ మాధ్యమంలో బీటెక్ కోర్సులను ఆఫర్ చేయనున్నట్టు జోధ్‌పూర్ ఐఐటీ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు ఇటీవల తమ సెనేట్ ఆమోదించినట్టు తెలిపింది. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎంచుకున్న ప్రాధాన్యతలను బట్టి వారిని రెండు సెక్షన్లుగా విభజిస్తామని, అనంతరం వారికి ఆంగ్లం, హిందీలో బోధన ప్రారంభిస్తామని వివరించింది. బోధన, అభ్యసన ప్రక్రియల్లో సమతూకాన్ని పాటించేందుకు వీలుగా ఇంగ్లిష్, హిందీ సెక్షన్ల విద్యార్థులకు ఒకే అధ్యాపకుడు బోధిస్తాడని తెలిపింది.
డార్క్ చాక్లెట్‌తో చిగురు వ్యాధులు దూరం!
న్యూఢిల్లీ: డార్క్ చాక్లెట్లతో చిగురు సంబంధింత వ్యాధుల ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. డార్క్ చాక్లెట్లలో ఉండే యాంటీఆక్సిడెంట్సే ఇందుకు కారణమని పరిశోధకులు తెలిపారు. ఈ చాక్లెట్లను తినడం వల్ల చిగురు సంబంధిత వ్యాధుల ముప్పు 54 శాతం వరకు తగ్గుతుందని వెల్లడించారు. చైనాలోని చాంగ్కింగ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఆవాస్ యోజన సొమ్ము అందగానే ప్రేమికులతో పరార్!
లక్నో, జూలై 9: పేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి కేంద్రం ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) డబ్బులను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు! ఈ పథకం ద్వారా మొదటి విడత ఆర్థిక సాయం అందుకున్నాక యూపీలో 11 మంది వివాహితలు భర్తలను వదిలేసి ప్రేమికులతో ఉడాయించారు. దీంతో రెండో విడత సాయాన్ని ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహరాజ్ గంజ్ జిల్లాలో మొత్తం 2,350 మంది పీఎంఏవై లబ్ధిదారులు ఆర్థిక సాయం అందుకోగా.. అందులో 11 మంది వివాహితలు డబ్బు అందాక ప్రేమికులతో కలిసి పారిపోయారు.