Private Quota : ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్ధానికులకు రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపిన నేపధ్యంలో ప్రైవేట్ కోటాపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఓబీసీలు, ఇతర వెనుకబడిన తరగుతల అభ్యర్ధులకు రిజర్వేషన్ కల్పించాలని భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలను తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) డిమాండ్ చేస్తోందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బుధవారం స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన యువత చాలా మంది ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం చూస్తున్నారని, కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్ లేదని అన్నారు. త్వరలోనే ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రైవేట్ రంగంలోకి మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగంలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోందని ఆయన పేర్కొన్నారు. జనరల్ క్యాటగిరీ అభ్యర్ధులను తాము వ్యతిరేకించడం లేదని అన్నారు.
కాగా, ప్రైవేట్ కంపెనీలు, సంస్ధల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను 50 శాతం, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 75 శాతం కన్నడిగులకు అవకాశం కల్పించాలనే బిల్లుకు సోమవారం కర్నాటక క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీలు రాష్ట్రాన్ని వీడి వెళ్లవచ్చని పరిశ్రమ సంస్ధ నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈ వ్యవహారంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ప్రైవేట్ కోటాపై ఇన్వెస్టర్లు కలత చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
పెట్టుబడిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు..ఇన్వెస్టర్లు కర్నాటకకు రావాలని మేం కోరుకుంటున్నామని డీకే శివకుమార్ పేర్కొన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నైపుణ్యం కలిగిన అభ్యర్ధులు కర్నాటకలో పనిచేసేందుకు తాము స్వాగతిస్తామని చెప్పారు. వారు కర్నాటకలో పనిచేయాలని తాము ఆశిస్తామని తెలిపారు. బయటి ప్రాంతాల వారు ఇక్కడ పనిచేసేందుకు వస్తుండటంతోనే బెంగళూర్ జనాభా 1.4 కోట్లకు పెరిగిందని వివరించారు. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.
తాము కేవలం స్ధానికులకు (కన్నడిగులు) పనిచేసే అవకాశం కల్పించాలనే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. కన్నడిగులకు ఉపాధి అవకాశాలను ఎలా సర్దుబాటు చేయాలనేదానిపై తాము దృష్టిసారిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
Read More :
Jagannath Puri Ratna Bhandar | జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారంలో మరో రహస్య గది?