Sukanta Majumdar : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు మిన్నంటాయి. ఇకఈ ఘటనకు సంబంధించి నిర్వహించిన శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఘటనపై కేంద్ర మంత్రి సుకంత మజుందార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన సిగ్గుచేటని, సమగ్ర దర్యాప్తును చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని అన్నారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీసులు తొలుత ఇది ఆత్మహత్య కేసని చెప్పి, ఆపై హత్య కేసు అన్నారని అసలు సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయని చెప్పారు. కాగా, ఈ ఘటనపై జేఎంఎం ఎంపీ మహువ మాఝీ స్పందించారు. ఈ తరహా ఘటనలు ఎక్కడ జరిగినా వాటిని తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఈ ఘటనలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి దోషులను తక్షణమే గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం తగదని ఆమె పేర్కొన్నారు.
Read More :