Smriti Irani | న్యూఢిల్లీ: దేశంలో పేదల ఆకలి కేకలను బయటపెట్టిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఏదో 3 వేల మందికి ఫోన్ చేసి ‘మీకు అకలిగా ఉన్నదా’ అని ప్రశ్నించి నివేదిక ఇస్తారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఆమె మాటల్లో దయ లేదని, అజ్ఞానం కనిపిస్తుందని ధ్వజమెత్తారు. ‘ఇంత కంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు. మీ మాటల్లో మీ అజ్ఞానాన్ని చూపారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ విమర్శించారు.
శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ ‘అహంకారానికి మరో రూపం ఉంటే.. అది స్మృతి ఇరానీనే’ అని ధ్వజమెత్తారు. కాగా, ఈ ఏడాది విడుదలైన హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్ 125 దేశాలకుగానూ కేవలం 28.7 స్కోరుతో 111వ స్థానంలో ఉన్నది. బీజేపీ పాలనలో ఈ ర్యాంకు ఏటికేటికి దిగజారుతూ వచ్చింది.