న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న తరుణంలో డీజిల్‌లో ఇథనాల్ కలపడం విఫలమైందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. డీజిల్‌లో పదో వంతు ఇథనాల్‌ను కలపడం కోసం చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయని తెలిపారు. మరోవైపు డీజిల్‌కు 10 శాతం ఐసొబ్యూటనాల్ను కలపడం సాధ్యమవుతుందా? అనే అంశంపై ఆటోమోటివ్ రీసెర్చ్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) పరీక్షలు చేస్తున్నదని చెప్పారు.
ఇండియా సుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) వార్షిక సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ఐసొబ్యూటనాల్ను ఇతరత్రా వేటితోనూ కలపకుండా ఉపయోగించడంపై కూడా ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఐసొబ్యూటనాల్ అనేది ఆల్కహాలిక్ కాంపౌండ్, దీనికి మండే స్వభావం ఉంటుంది. పెయింట్స్, కోటింగ్ వంటి పరిశ్రమల్లో దీనిని ద్రావణంగా ఉపయోగిస్తారు. గడ్కరీ మాట్లాడుతూ, ఇటీవల ట్రాక్టర్ కంపెనీలు, వ్యవసాయ పరికరాల తయారీదారుల సమావేశం జరిగిందని, సీఎన్జీ, ఐసొబ్యూటనాల్ మిశ్రమం సాధ్యాసాధ్యాల గురించి ఆత్రుత వ్యక్తం చేశారని తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తాము కొంటున్న పెట్రోలులో 20 శాతం ఇథనాల్ ఉన్నట్లు తెలుసుకుని వాహనాల యజమానులు ఉలిక్కిపడ్డారు. ఈ విధానాన్ని 2030నాటికి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అకస్మాత్తుగా, రహస్యంగా దీనిని ముందుగానే అమల్లోకి తెచ్చింది. ఫలితంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. అయితే ఇథనాల్ వాడకం వల్ల వాహనాల మైలేజీ దెబ్బ తింటుందని, కొన్ని పరికరాలు దెబ్బ తింటాయని నిపుణులు చెప్పారు.
డీలర్లు మాత్రం ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ప్రయోగశాల పరిస్థితుల్లో 2-4 శాతం మేరకు తగ్గవచ్చునని చెప్తున్నారు. రోడ్డుపైకి వెళ్లిన తర్వాత, పాత వాహనాలకు ఈ తగ్గుదల మరింత పెరగవచ్చు. దీనిపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వాహనాల్లో స్వల్ప మార్పులు చేసుకుంటే సరిపోతుందని చెప్పింది. అయితే ఆయన తాజా ప్రకటనతో ఇథనాల్ ‘భావి ఇంధనం’ అంటూ ఆయనే చెప్పిన మాటలు డొల్ల అని తేలిపోయింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధర లీటరుకు కేవలం రూ.22 మాత్రమే ఉంటుందని ఆయన చెప్పిన మాటలు కూడా నిజం కాలేదు.