JP Nadda : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జేపీ నద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌వి నీచ రాజకీయాలు అని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని నద్దా విమర్శించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా సాహిల్ అనే యువకుడికి పెల్లెట్ గాయాలయ్యాయని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ.. ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
అయితే, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆయన అక్కడే నిరసనకు దిగారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. అయితే, రాహుల్ చేస్తున్న నిరసనపై బీజేపీ ఘాటుగా స్పందించింది. రాహుల్ నీచ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి జేపీ నద్దా ధ్వజమెత్తారు. రాహుల్ అటెన్షన్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని నద్దా విమర్శించారు. విద్యార్థులకు న్యాయం చేయాలనేది రాహుల్ ఉద్దేశం కాదని, ప్రచారం కోసం, డైవర్షన్, అటెన్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.
వందేమాతరం గేయం వివాదంలో కాంగ్రెస్ పొరపాటుపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రాహుల్ఈ నిరసన చేస్తున్నారని నద్దా ఆరోపించారు. దేశం మొత్తం ఆయన నీచ రాజకీయాల్ని గమనిస్తోందన్నారు. విద్యార్థులపై దాడి అంశంపై సుప్రీంకోర్టుతోపాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారని, అయినప్పటికీ రాహుల్ గాంధీ నిరసన తెలియజేయడంలో అర్ధం ఏంటని నద్దా ప్రశ్నించారు.
సుప్రీంకోర్టే ఈ అంశంపై పర్యవేక్షిస్తుండగా రాహుల్ పోలిస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. తను హెడ్‌లైన్స్‌లో ఉండేందుకే ఈ డ్రామా ఆడుతున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకే రాహుల్ నిరసన చేస్తున్నారని విమర్శించారు.