Pahalgam Attack | పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతపై ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షత వహించారు. బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ, అసోం రైఫిల్స్ చీఫ్లు, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారులు సైతం సమావేశానికి హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడి తర్వాత భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) చీఫ్ శ్రీనివాసన్, అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, ఎస్ఎస్బీ అదనపు డైరెక్టర్ జనరల్ అనుపమ నీలేకర్ చంద్ర సమావేశంలో పాల్గొన్నారు.
జమ్మూ కశ్మీర్ పోలీసులు దోడా జిల్లాలో 13 ప్రదేశాల్లో దాడులు నిర్వహించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న వ్యక్తులపై చర్యలు చేపట్టారు. మరో వైపు శ్రీనగర్లో పోలీసులు అనేక ప్రదేశాల్లో ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs), నిషేధిత ఉగ్రవాద సంస్థలో పని చేస్తున్న వారి ఇండ్లపై విస్తృత దాడులు నిర్వహించారు. శ్రీనగర్లో పోలీసులు ఇప్పటి వరకు 63 మంది వ్యక్తులకు సంబంధించిన ఇండ్లను సోదా చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చట్ట ప్రకారం జమ్మూ కశ్మీర్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఆయుధాలు, పత్రాలు, డిజిటల్ పరికరాలు మొదలైన వాటిని సేకరించి.. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు ఆధారాలను సేకరించారు.
ఈ నెల 22న మంగళవారం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 26 మంది చనిపోయారు. పహల్గాంలోని బైసరన్ లోయలో ఆర్మీ యూనిఫాంలో వచ్చిన ఉగ్రవాదులు మొదట ఎవరి మతం ఏంటో తెలుసుకొని గుర్తింపు కార్డులను పరిశీలించారు. హిందువులను కాల్చి చంపారు. మొత్తం 26 మంది పర్యాటకులు చనిపోగా.. ఇందులో ఇద్దరు విదేశీయులు, మరో ఇద్దరు స్థానిక పౌరులు ఉన్నారు. ఈ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. ఆ దాడిలో 47 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.