న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నేర న్యాయ చట్టాల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులను కేంద్రం వెనక్కు తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. వాటి స్థానంలో పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసులతో కూడిన కొత్త ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టారు. సీఆర్పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాలను మారుస్తూ కేంద్రం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఐదు విభాగాల్లో మార్పులు చేశామని, చాలా వరకు మార్పులు వ్యాకరణం, భాషకు సంబంధించినవేనని అమిత్‌షా తాజాగా పేర్కొన్నారు. కొత్త బిల్లులపై లోక్‌సభలో గురువారం చర్చ, శుక్రవారం ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్ష ఎంపీల డిమాండ్ మేరకు ముసాయిదా బిల్లులపై అధ్యయనం చేసేందుకు వారికి 48 గంటల సమయం ఉందన్నారు. మూడు బిల్లులను జాయింట్ కమిటీకి పంపాలన్న డిమాండ్‌ను అమిత్‌షా తిరస్కరించారు.
‘ఉగ్రవాదం’ నిర్వచనంలో మార్పులు.. చేర్పులు
కొత్త ముసాయిదా బిల్లు ల్లో ‘ఉగ్రవాదం’కు నిర్వచనంలో మార్పు చేశారు. భారతీయ న్యాయ(రెండో) సంహిత బిల్లులో టెర్రరిజం నిర్వచనంలో ‘ఆర్థిక భద్రత’ అనే పదాన్ని కూడా చేర్చారు. ‘దేశంలో లేదా విదేశాల్లో భారత ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత లేదా ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించేలా ఎవరైనా చర్యలకు పాల్పడితే.. ’ అని మార్పు చేసిన కొత్త బిల్లు పేర్కొన్నది. పాత బిల్లులోని సెక్షన్ 73లో మార్పులు చేశారు.
లైంగిక దాడి లేదా అలాంటి ఇతర నేరాల బాధితుల గుర్తింపు వివరాలను కోర్టు అనుమతి లేకుండా వెల్లడించేలా కోర్టు ప్రోసీడింగ్స్‌ను ప్రచురించడం శిక్షార్హమైనదిగా కొత్త బిల్లు పేర్కొన్నది. పాత నేర న్యాయ బిల్లులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధికారులు, సంబంధిత నిపుణులతో పలుమార్లు చర్చలు జరిపిందని, నవంబర్ 10న తన సిఫారసులతో కూడిన నివేదికను అందజేసిందని అమిత్‌షా సభలో వెల్లడించారు.
సీఈసీ హోదాపై వెనకడుగు
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల(ఈసీల) హోదా తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. గతంలో ఉన్నట్టుగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా వీరి హోదాను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకొన్నది. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐ తొలగింపు నిబంధనను మాత్రం కొనసాగించింది.
విధి నిర్వహణలో సీఈసీ, ఈసీలకు కోర్టు కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ కొత్త నిబంధనను బిల్లులో చేర్చింది. మంగళవారం ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈసీ స్వతంత్రతను దెబ్బతీసేలా నిబంధనలు ఉన్నాయని విపక్షాలు ఆరోపించాయి. ఈ బిల్లుతో ప్రభుత్వానికి జీ హుజూర్ అనే వ్యక్తులను అధికార పార్టీ నియమించే అవకాశం ఉందని విమర్శించాయి. ఇది ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుందని పేర్కొన్నాయి.
విమర్శలతో వెనక్కి..
ఈసీల నియామకాలకు సంబంధించి కేంద్రం ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవీకాలం బిల్లు-2023’ను ఆగస్టులో రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లులో ఈసీల హోదాలో మార్పులు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా కాకుండా, క్యాబినెట్ సెక్రటరీలతో సమాన హోదాను ఇస్తామని ప్రతిపాదించింది.
దీనిపై విపక్షాలు, మాజీ సీఈసీల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఇది ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీయటమేనని ఆరోపించారు. దీంతో, వారి హోదాను మార్చకూడదని కేంద్రం నిర్ణయించింది. సీఈసీ, ఈసీలు పదవుల్లో ఉండగా, వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టకూడదని నిబంధన చేర్చింది. ఇటీవల తెలంగాణలో ఈసీపై ఒక జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సవరణ చేర్చారు.
ఎంపిక కమిటీలో సీజేఐ తొలగింపు
ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధాని నేతృత్వంలో సీజేఐ, విపక్ష నేత ఉంటారు. కానీ బిల్లులో సీజేఐని తొలగించి, ప్రధాని నియమించే క్యాబినెట్ మంత్రిని సభ్యులుగా చేర్చారు. ఈ సవరణపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే, కేంద్రం దీనిలో ఎలాంటి మార్పులు చేయలేదు.