Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై తమిళిసై ఇప్పటి వరకు స్పందించలేదు.
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెంకయ్య నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే తమిళిసై కూడా హాజరయ్యారు. ఇక వేదికపై ఉన్న వారందరికీ అభివాదం చేస్తూ వెంకయ్య వద్దకు వచ్చారు తమిళిసై. వెంకయ్య నాయుడు, అమిత్ షాకు అభివాదం చేస్తూ తమిళిసై ముందుకు సాగారు. కానీ అమిత్ షా వెనక్కి రప్పించారు ఆమెను. ఆ తర్వాత సున్నితంగా ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఆ వీడియో ద్వారా స్పష్టం మవుతోంది.
ఎందుకంటే తమిళనాడు బీజేపీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తమిళనాడులో ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా బీజేపీ గెలవలేదు. దీంతో బీజేపీ చీఫ్ అన్నామలై, మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్ మధ్య వర్గపోరు తారాస్థాయిలో నడుస్తోంది. ఈ వర్గపోరుపై దృష్టి సారించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తమిళిసైకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సంఘ విద్రోహశక్తులు బీజేపీలోకి ప్రవేశించిన తర్వాతనే తమిళనాడులో బీజేపీ ప్రాబల్యం తగ్గి ఓటమికి కారణమైందని తమిళిసై ఇటీవలే విరుచుకుపడ్డారు. అయితే అన్నామలైని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పరాజయానికి అన్నామలైనే కారణమని తమిళిసై మద్దతుదారులు ఆరోపించారు. తన అధ్యక్షతన ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని అన్నామలై పేర్కొన్నారు. మొత్తానికి ఇరువురి మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి.