న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. పలుదేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని కోరింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎలాంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి రాకపోకలపై ప్రస్తుతానికైతే ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలో కొవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయని, క్రియాశీల కేసులు ఐదువేలకు దిగువనే ఉన్నాయని వివరించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికాల్లో దేశాల్లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో కొవిడ్ కేసుల సంఖ్య మొత్తం 10కోట్లు దాటిందని కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా.. ఆయా దేశాల్లో కొవిడ్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం.. తద్వారా వైరస్ పరివర్తన చెందినట్లయితే, కొత్త వేరియంట్‌ను గుర్తించవచ్చని స్పష్టం చేసింది.