Union Budget | న్యూఢిల్లీ, జూలై 22: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. దీంతో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలువనున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఏయే కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు? మధ్యతరగతికి ఆదాయ పన్ను ఉపశమనం ఉంటుందా? జనాకర్షక స్కీమ్‌లు ఏముంటాయి? అనే అంశాలపై చర్చ నడుస్తున్నది.
మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ, గత రెండు పర్యాయాలతో పోలిస్తే లోక్‌సభలో బీజేపీ ఎంపీ సీట్ల సంఖ్య తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిత్రపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొత్త పద్దులో వృద్ధికి ఊతమివ్వడమే కాకుండా ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ఇది వరుసగా ఏడో బడ్జెట్. తద్వారా ఆరుసార్లు వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె అధిగమించనున్నారు. మొత్తంగా ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరుపై ఉన్నది. ప్రధానులుగా నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి హయాంలలో ఆయన 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019లో కేంద్రంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలను ఆర్థిక మంత్రిగా నియమించారు.
కొత్త బడ్జెట్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధరల సమస్యను పరిష్కరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందా? అని దేశ రైతులు ఎదురుచూస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధరలు పెంచాలని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని రైతులు ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం పెంపుపైనా ఆశలు పెట్టుకొన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై తొలిరోజే లోక్‌సభ దద్దరిల్లింది. అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. నీట్ మాత్రమే కాదు.. దేశ మొత్తం పరీక్షా వ్యవస్థలోనే తీవ్రమైన సమస్య ఉన్నదని విపక్షాలు ఆరోపించాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించాయి. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ దేశంలోని మొత్తం పరీక్షా వ్యవస్థ మోసపూరితమని విద్యార్థులు భావిస్తున్నారని అన్నారు.
విద్యా శాఖ మంత్రి ప్రధాన్ తనపై తప్ప ఇతరులపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఈ వ్యవస్థాగత సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారని ప్రశ్నించారు. దీనిపై ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ రాహుల్ గాంధీ, ఆయన పార్టీ మొసలి కన్నీరు కారుస్తున్నదని అన్నారు. గత ఏడేండ్లలో 70 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయన్న విపక్షాల ఆరోపణలపై మాట్లాడుతూ గత ఏడేండ్లలో పేపర్ లీకేజీలు జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేశ్ మాట్లాడుతూ పేపర్ లీకేజీల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తున్నదని ఎద్దేవా చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించిన పరీక్షా కేంద్రాల వివరాలను వెల్లడించాలన్నారు.
మరోవైపు నిత్యావసరాలతో సహా అన్ని ధరలు పెరగడంతో గత కొన్నేండ్లుగా ప్రజల జీవన వ్యయాలు గణనీయంగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగా వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో ఉపశమనం మాత్రం దక్కడం లేదు. ఈసారైనా కేంద్రం ఊరటనిస్తుందా? అని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.10 లక్షల లోపు ఆదాయమున్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కొత్త బడ్జెట్లో కొంత ఉపశమనం ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.