Union Cabinet : ప్రధాన నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఇవాళ (శుక్రవారం) కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది జనగణన కోసం నిధులు కేటాయించడం. ఈ సారి జనగణన కోసం కేటాయించిన రూ.11,718 కోట్ల బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2027లో రెండు విడతల్లో జనగణన జరగనుంది. అయితే ఈసారి డిజిటల్ టెక్నాలజీ (Digital Technology) ని ఉపయోగించి జనగణన చేపట్టనున్నారు. కాగా ఇలా డిజిటల్ టెక్నాలజీతో జనగణన చేపట్టడం ఇదే తొలిసారి.
బొగ్గు గనుల్లో సంస్కరణలకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఆ పథకం పేరును మార్చింది. అదేవిధంగా ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 120కి పెంచింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
అదేవిధంగా భారత్-ఒమన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు, బీమా రంగంలో ఫుల్ ఎఫ్‌డీఐలకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా జనగణనతోపాటే కులగణనను కూడా కేంద్రం చేపట్టనుందని మంత్రి తెలిపారు. అయితే వ్యక్తుల కులం వివరాలు దాచి ఉంచుకునే అవకాశం పౌరులకు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. డిజిటల్ డాటాలో పౌరులు తమ వ్యక్తిగత వివరాలను హైడ్ చేసుకుంటే ఎవరికీ కనిపించవని, కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే కనిపిస్తుందని స్పష్టం చేశారు.