Union Cabinet : ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ 2025 సంవత్సరంలో తొలిసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై ఒక 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350 కే లభ్యం కానుంది. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చూకూరనుంది.
అదేవిధంగా ‘ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ’కి కేంద్రం రూ.800 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. అంతేగాక పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.