Union Cabinet | పహల్గాం ఉగ్రదాడి తర్వాతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు మరింత పెరిగాయి. అన్నివిధాలుగా పాక్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులు, రక్షణ మంత్రి సహా పలువురితో ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహించారు. తాజాగా బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో సరిహద్దుల్లో భద్రతతో పాటు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మంత్రులు చర్చించనున్నారు.
ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీతో వరుసగా భేటీ అయ్యారు. బుధవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ కానుండడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతున్నది. వాస్తవానికి, పెహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అప్పటి నుంచి పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పాక్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సార్క్ వీసా స్కీమ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులంతా ఆ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
అట్టారీ సరిహద్దు మూసివేత, పాక్ విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ దరుణంలో పాక్ దాడులకు తెగబడవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ భద్రత విషయంలో వరుస భేటీలు నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ తరుణంలో ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. భేటీలో పాకిస్తాన్ దాడులు చేస్తే ఎలా వ్యవహరించాలి..? ప్రజలు ఆందోళనకు గురవకుండా ఎలాంటి సూచనలు చేయాలి దేశంలో అత్యవసరమైన కీలకమైన కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి..? ఏదైనా ప్రమాదం వాటిల్లితే ప్రజలను తరలించేందుకు ఉన్న మార్గాలంటీ ? తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది.