న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు వెలువడ్డాయి. దేశంలో వృద్ధికి వ్యవసాయమే మొదటి చోదకశక్తి అని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.3 లక్షలుగా ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
ఆహార, ఎరువుల సబ్సిడీలకు కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ సబ్సిడీలకు రూ.3.71 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఈ కేటాయింపులు 0.70 శాతం అధికం. వచ్చే ఆర్థిక సంవత్సర ఆహార సబ్సిడీ కోసం బడ్జెట్లో రూ.2,03,420 కోట్లు కేటాయించారు. 2024-25 సవరించిన అంచనా రూ.1,97,420 కోట్ల కంటే ఇది స్వల్పంగా అధికం. వచ్చే ఏడాది ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.67 లక్షల కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా 1.71 లక్షల కోట్ల కంటే ఇది కొంత తక్కువ.