న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రానున్న మూడేండ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా దవాఖానల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. వీటిలో 200 సెంటర్లను వచ్చే ఆర్థిక సంవత్సంరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ ప్రకటించారు. వచ్చే ఐదేండ్లలో మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో కొత్తగా 75 వేల సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నదని, వాటిలో 10 వేల సీట్లను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఆన్లైన్ వేదికలపై పనిచేసే కోటి మంది గిగ్ వర్కర్లకు త్వరలో గుర్తింపు కార్డులను జారీచేసే ప్రక్రియను ప్రారంభించనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పట్టణాల్లో పనిచేసే కార్మికుల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి ఓ పథకాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. గిగ్ వర్కర్లు సేవలను గుర్తిస్తూ త్వరలోనే ఈ-శ్రమ్ పోర్టల్‌లో వారి పేర్లను నమోదుచేసి గుర్తింపు కార్డులు జారీచేసే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. హెల్త్‌కేర్ సదుపాయాలను కల్పిస్తామని, తద్వారా దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చే ఔషధాల జాబితాలో 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను, రాయితీతో 5% కస్టమ్స్ సుంకాన్ని విధించే ఔషధాల జాబితాలో 6 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను చేరుస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొన్ని రకాల మందులకు బీసీడీ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య శాఖకు కేటాయింపులు పెరిగాయి. ఈసారి ఆ శాఖకు మొత్తం రూ.99,858.56 కోట్లు కేటాయించారు. ఇవి గత బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం కేటాయించిన రూ.89,974.12 కోట్ల కంటే 11% అధికం. ఇందులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.95,957.87 కోట్లు, ఆరోగ్య పరిశోధనా విభాగానికి రూ.3,900.69 కోట్లు వెచ్చించనున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఈసారి రూ.3,497.64 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.3,992.90 కోట్ల కంటే 14.15% అధికం. నేషనల్ హెల్త్ మిషన్‌కు గత బడ్జెట్లో రూ.36 వేల కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈసారి రూ.37,226.92 కోట్లకు, ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజనకు జరిపిన కేటాయింపులు రూ.7,605.54 కోట్ల నుంచి రూ.9,406 కోట్లకు పెంచారు.