ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఈసారి విద్యారంగానికి రూ.1.28 లక్షల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలు 1.14 లక్షల కోట్ల కంటే ఇది రూ.14 వేల కోట్లు ఎక్కువ కావడం గమనార్హం.ఈ బడ్జెట్లో హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.50,067 కోట్లు, స్కూల్ విద్యకు రూ.78,572 కోట్లు కేటాయించారు.
దేశంలోని ఐదు ఐఐటీల్లో మౌలిక వసతుల పెంపు, పాట్నా ఐఐటీని విస్తరించనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘గత పదేండ్లలో దేశంలోని మొత్తం 23 ఐఐటీల్లో సీట్ల సంఖ్యను 65 వేల నుంచి 1.35 లక్షలకు పెంచాం. 2014 తర్వాత ప్రారంభించిన ఐదు ఐఐటీల్లో మరో 6,500 మంది విద్యార్థులకు సరిపోయేలా వసతులు కల్పిస్తాం. ఐఐటీ పాట్నాలో హాస్టల్, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నాం. ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించాం. ఇది గత బడ్జెట్లో కేటాయింపులు రూ.10,467 కోట్ల కంటే ఎక్కువ.
అంతేకాదు, ఏటా 10 వేల చొప్పున.. రానున్న ఐదేండ్లలో మొత్తం 75 వేల వైద్య విద్య సీట్లను పెంచనున్నాం. రానున్న ఐదేండ్లలో ఐఐటీ, ఐఐఎస్సీల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 10 వేల ఫెలోషిప్లను అందించనున్నాం. విద్యాభివృద్ధి కోసం ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటర్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించాం. యూజీసీ, ఎన్సీఈఆర్టీ సహా అన్ని సంస్థలకు కేటాయింపులు పెంచాం. వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్లకు కేటాయింపులను రూ.1000 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గించాం’ అని కేంద్రమంత్రి తెలిపారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు రానున్న ఐదేండ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు నెలకొల్పనున్నట్టు నిర్మల తెలిపారు. పాఠశాల, హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఉపయోగపడేలా భారతీయ భాషలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసేందుకు భారతీయ భాషా పుస్తక్ పథకాన్ని తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో ఐదు నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు, అన్ని సెకండరీ స్కూళ్లకు బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ చేయనున్నట్టు వివరించారు.