Budget 2024 | న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్- 2024-25ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు బడ్జెట్లో చాలా ప్రాధాన్యం దక్కింది. మిత్రపక్షాలను కాపాడుకోవాలనే బీజేపీ తాపత్రయం బడ్జెట్లో ప్రతిబింబించింది. బీజేపీ పాలిత రాష్ర్టాలకూ పెద్దపీట వేసిన కేంద్రం.. విపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాలకు మాత్రం మొండిచేయి చూపించింది. తెలంగాణ సహా కొన్ని రాష్ర్టాల పేర్లు కూడా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ నోటి వెంటి వినపడలేదు. ఇక, ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడానికి ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్యపై పదేండ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. ఉద్యోగ కల్పన కోసం బడ్జెట్లో కేంద్రం కొత్త పథకాలను ప్రకటించింది.
పెరుగుతున్న నిత్యావసరాల ధరల కట్టడికి మాత్రం ఎలాంటి చర్యలూ కానరాలేదు. పైగా ఆహార, ఎరువులు, వంటగ్యాస్పై సబ్సిడీలకు కోత విధించి పేదల నడ్డి విరిచింది కేంద్రం. బంగారం, వెండిపై మాత్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో పసిడి పరుగులకు బ్రేకులు వేసింది. ఒకవైపు గ్రామీణాభివృద్ధికి, భూసంస్కరణలకు కొంత ప్రాధాన్యత దక్కినా వ్యవసాయ రంగానికి మాత్రం అంతగా ప్రోత్సాహం దక్కలేదు. పాత పథకాలకు అరకొర కేటాయింపులే జరిగాయి. ఉద్యోగ కల్పన కోసం మినహా ఇతర కొత్త పథకాలేవీ లేవు. ఉన్నత విద్యను ప్రోత్సహిస్తామనే మాటలు బడ్జెట్లో నిజరూపం దాల్చలేదు. ఉన్నత విద్యాసంస్థల నిధులకు కేంద్రం కోత పెట్టింది. మొత్తంగా అన్ని వర్గాలు ఎంతో ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ ఉసూరుమనిపించింది.
మధ్య తరగతికి ప్రాధాన్యం ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినప్పటికీ బడ్జెట్లో మాత్రం కనిపించలేదు. కొంత పన్ను వెసులుబాటు కల్పించినా అది కేవలం కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి మాత్రమే కావడం వేతనజీవుల ఆశలపై నీళ్లు చల్లింది. అణురంగంలోకి, వ్యవసాయ పరిశోధనల్లోకి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ వర్గాలను సైతం కేంద్ర బడ్జెట్ సంతృప్తి పరచలేదు. బడ్జెట్ ప్రకటనకు ముందు లాభాల్లో ట్రేడయిన సూచీలు బడ్జెట్ ప్రకటన తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచడం చిన్న వ్యాపారులకు కొంత ప్రోత్సహించే అంశం. రక్షణ, ఆరోగ్య రంగాలకు స్వల్పంగా నిధుల కేటాయింపును పెంచింది.
బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె.. సీడీ దేశ్ముఖ్ రికార్డును సమం చేశారు. 1951 నుంచి 56 మధ్య వరుసగా ఏడు పర్యాయాలు ఆయన ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ 2019 నుంచి ఆరు పూర్తిస్థాయి బడ్జెట్లను, ఒక మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పూర్తిస్థాయి బడ్జెట్లనే పరిగణనలోకి తీసుకుంటే ఆరుసార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సమం చేశారు. కాగా, మంగళవారం ఆమె బడ్జెట్ ప్రసంగం 1:32 గంటల పాటు కొనసాగింది.
