కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పరాజయం ఖరారవ్వటంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలపై కొంతమంది దాడులకు తెగబడ్డారు. పార్టీ కార్యాలయాల్లోని ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లు, పార్టీ తోరణాలను ధ్వంసం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. బర్ధమాన్ జిల్లా జామురియాలో గుర్తుతెలియని వ్యక్తులు తృణమూల్ కార్యాలయానికి నిప్పుపెట్టినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
బారీపూర్లో పార్టీ బ్యానర్లు, సీఎం మమతా బెనర్జీ, తృణమూల్ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఫొటోలను చింపేసి రోడ్డున పడేయటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనల వెనుక బీజేపీ మద్దతుదారులు ఉన్నారని తృణమూల్ ఆరోపించగా, ఈ ఘటనల్లో తమ ప్రమేయం లేదని బీజేపీ వెల్లడించింది. ఎన్నికల ఫలితాల సరళి బయటకు వచ్చిన వెంటనే అసన్సోల్లో, బారీపూర్, తుఫాన్గంజ్, పానిహటిలోని తృణమూల్ కార్యాలయాల్లో విధ్వంసానికి పాల్పడినట్టు టీఎంసీ ఆరోపించింది.