ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను అక్కడకు తరలించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానస్పద వస్తువులు కనిపించలేదని జోన్ 3 డీసీపీ తెలిపారు. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద పెట్రోలింగ్‌ను పెంచారు. అలాగే అదనపు భద్రతా బలగాలు, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, నాగపూర్ పోలీసులను భారీగా మోహరించారు. స్థానికంగా నివసించే ప్రజల కదలికలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. అయితే బాంబు బెదిరింపు గురించి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం లేదా నాగపూర్ పోలీస్ కమిషనర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.