ధార్వాడ్, సెప్టెంబర్ 25: ఖాళీలను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ వందలాది మంది నిరుద్యోగ యువకులు గురువారం కర్ణాటకలోని ధార్వాడ్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియచేశారు. తమ నిరసనలో భాగంగా నిరుద్యోగ యువజనులు ఆర్టీరియల్ జంక్షన్, జూబ్లీ సర్కిల్ని అడ్డగించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులకు నాలుగు గంటలు పట్టింది.
అఖిల కర్ణాటక విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. ధార్వాడ్లోని వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులు వందలాదిగా శ్రీనగర్ నుంచి కాలేజ్ రోడ్డు వైపు కదిలారు. అక్కడి నుంచి జుబిలీ సర్కిల్ చేరుకుని నిరసన తెలిపారు. వివిధ శాఖలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.