లక్నో: గాలి వానకు నిర్మాణంలో ఉన్న వంతెన భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (Under-Construction Bridge Collapses) ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోరకందర్ నుంచి కందౌర్ గ్రామం వరకు బెట్వా నదిపై ఒక బ్రిడ్జి నిర్మిస్తున్నారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కొంత మంది కార్మికులు లిఫ్ట్ యంత్రం కింద నిల్చొని ఉన్నారు. అయితే గాలి వాన బీభత్సం వల్ల నిర్మాణంలో ఉన్న వంతెనకు చెందిన ఒక స్లాబ్ కూలిపోయింది. దీంతో ఆధార స్తంభాలు కూడా కూలిపోయాయి.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు కూలీలను రక్షించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించినట్లు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.