బాబాయ్ శివపాల్ యాదవ్, అబ్బాయ్ అఖిలేశ్ యాదవ్ కథ మళ్లీ మొదటికే వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా స్వయంగా అఖిలేశే బాబాయ్ శివపాల్ ఇంటికి వెళ్లి… ఎన్నికల్లో తనతో కలిసి రావాలని కోరారు. అఖిలేశ్ కోరడమే ఆలస్యం శివపాల్ గుక్కతిప్పుకోకుండా సరేనన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. గెలిచారు. అయితే వీరిద్దరి మధ్య సఖ్యత పూర్తిగా కుదరలేదా? అన్న అనుమానాలు వస్తున్నాయి.
హోళీ పర్వదినం సందర్భంగా ములాయం సింగ్ పరివారం మొత్తం పెద్ద ఎత్తున హోళీ సంబరాలు చేసుకుంది. ఈ సంబరాలకు అఖిలేశ్, ములాయం, రాంగోపాల్ యాదవ్, శివపాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. అయితే.. హోళీ సందర్భంగా శివపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. బాబాయ్ అబ్బాయ్ మధ్యలో రాంగోపాల్ యాదవ్ కూర్చున్నారు.
వేదిక ఎక్కగానే శివపాల్ యాదవ్… రాంగోపాల్ యాదవ్ మాట్లాడుకున్నారు. కానీ.. బాబాయ్ అబ్బాయ్ మాత్రం మాట్లాడుకోలేదు. హోళీ సంబరాలు దాదాపు గంటన్నర పాటు సాగాయి. ఈ గంటన్నరలో ఇద్దరూ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఒకరివైపు ఒకరు చూసుకోనూ లేదు. దీంతో ఇద్దరి మధ్యా గ్యాప్ అలాగే వుండిపోయిందని అందరూ భావిస్తున్నారు. అఖిలేశ్ యాదవ్ అప్పుడప్పుడు రాంగోపాల్ యాదవ్‌తో మాట్లాడారు కానీ.. శివపాల్ తో మాత్రం అస్సలు మాట్లాడలేదు.