Rahul Gandhi : యూపీలోని అమేథి, రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపిణీ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని, సీట్ల పంపిణీ కొలిక్కివచ్చిన అనంతరం కాంగ్రెస్ న్యాయ్ యాత్రలో ఎస్పీ పాల్గొంటుందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్ధానాల్లో పోటీ చేస్తుంది, అభ్యర్ధుల పేర్లు ఖరారయ్యాయని, అయితే నిర్ధిష్ట సీట్లపై రాహుల్ గాంధీ పట్టుబడుతుండటంతో పొత్తు ఖరారులో జాప్యం జరుగుతోందని విపక్ష ఇండియా కూటమి వర్గాలు చెబుతున్నాయి. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల మధ్య సంప్రదింపులు జరిగాయని, అయితే సీట్ల సర్ధుబాటు ఇంకా ఖరారు కాలేదని సమాచారం. సోమవారం సాయంత్రానికి సీట్ల పంపిణీ ఖరారైతే అఖిలేష్ యాదవ్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటారని లేకుంటే రాహుల్ యాత్రకు ఆయన దూరంగా ఉంటారని ఎస్పీ వర్గాలు పేర్కొన్నాయి.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్ని ఇటీవల అఖిలేష్ అంగీకరిస్తూ అమేథి, రాయ్ బరేలిలో ఏదో ఒక ప్రాంతంలో తాను యాత్రలో పాల్గొంటానని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎస్పీ 11 స్ధానాలను ఆఫర్ చేసింది. కీలక హిందీ రాష్ట్రంలో తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.
Read More :
BAFTA Awards | బాఫ్టా అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్’.. ఏకంగా ఏడు అవార్డులు