లక్నో: భార్య వేధింపులను భరించలేక ఉత్తరప్రదేశ్, ఔరైయా జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మోహిత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు ఆయన ఓ వీడియో రికార్డు చేశారు. తన భార్య, ఆమె తల్లి, సోదరుడు తనను హింసించిన తీరును అందులో వివరించారు. తన ఇంటిని, ఆస్తులను తన భార్య ప్రియా యాదవ్ పేరిట రాయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని తెలిపారు. ఆస్తులను రాసి ఇవ్వకపోతే, వరకట్న వేధింపుల కేసు పెడతామని బెదిరించారన్నారు. “మీకు ఈ వీడియో కనిపించేసరికి, నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతాను. పురుషుల కోసం ఓ చట్టం ఉండి ఉంటే, నేను ఈ పని చేసి ఉండేవాడిని కాదేమో.
నేను నా భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న హింసను భరించలేకపోతున్నాను” అని ఆ వీడియోలో మోహిత్ చెప్పారు. తన భార్యకు గర్భస్రావం చేయించాలని ఆమె తల్లి ఒత్తిడి చేశారని, అన్ని ఆభరణాలు, చీరలు ఆమె వద్దనే ఉంచుకున్నారని తెలిపారు. ‘నేను మరణించిన తర్వాత అయినా నాకు న్యాయం జరగకపోతే, నా చితాభస్మాన్ని మురుగు కాలువలో కలిపేయండి. అమ్మా, నాన్నా, దయచేసి క్షమించండి. మీ ఆశలకు తగినట్లుగా నేను ఉండలేకపోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీస్ సూపరింటెండెంట్ అభయ్‌నాథ్ త్రిపాఠీ మాట్లాడుతూ, నోయిడాలోని ఓ హోటల్ గదిలో మోహిత్ మృతదేహాన్ని గుర్తించి, పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. మోహిత్ సోదరుడు తరణ్ ప్రతాప్ మాట్లాడుతూ, మోహిత్ నోయిడాలోని ఓ సిమెంట్ కంపెనీలో ఇంజినీరుగా పని చేస్తున్నాడని, అక్కడే ఆయనకు ప్రియ యాదవ్ పరిచయమైందని చెప్పారు. ఏడేళ్లపాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారని, అనంతరం వారికి పెండ్లి చేశామని తెలిపారు. పెండ్లి జరిగిన మూడు నెలల వరకు అంతా బాగానే గడిచిందని, బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఆమెకు టీచర్‌గా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పారు. తమ కుటుంబం నుంచి ఆయనను వేరు చేసిందని చెప్పారు.