(స్పెషల్ టాస్క్ బ్యూరో )
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ అధినాయకత్వంపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేస్తున్న ‘గంగా కినారే’ యాత్రకు, మద్య నిషేధ ఉద్యమానికి పార్టీపరంగా మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మద్యనిషేధ ఉద్యమంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ రాశానని ట్వీట్ చేశారు.
బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఒకే మద్యం పాలసీ అమలు చేయాలని ఆ లేఖలో కోరానన్నారు. మధ్యప్రదేశ్‌లో అమల్లో ఉన్న మద్యం పాలసీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే నెల ఎనిమిది వరకు తాను అజ్ఞాతంలో ఉంటానని, ఆ తర్వాత ఈ విషయంపై మాట్లాడతానని అధినాయకత్వానికి అల్టిమేటం జారీచేశారు. ఇంతకుముందు కూడా ఉమా భారతి పలుమార్లు మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. అవసరమైతే తాను బ్రాందీ షాపుల ఎదుట ధర్నా చేస్తానని కూడా హెచ్చరించారు.
దేవాలయాలు, పాఠశాలల ఎదుట మద్యం దుకాణాలు నడుపుతున్నారని మండిపడ్డారు. పురాతన హనుమంతుడి గుడి ముందే మద్యం షాపులు నడుపుతున్నారని, ఆ షాపును మూసేయాలని గత ఆరు నెలలుగా ప్రభుత్వంలోని పెద్దలకు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆ షాపు మూసేయాలని ఆదేశాలు ఇప్పిస్తే మూడు రోజులు తిరిగే సరికి కోర్టు స్టే ఆర్డరు తెచ్చి మళ్లీ నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపుల వల్ల చుట్టుపక్కలవాళ్లు బాధపడుతుంటే తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.