భోపాల్: తన కుమారుడు ఇలాంటి పనిచేసాడన్నది నమ్మలేకపోతున్నానని, 12ఏండ్ల బాలికపై ఘాతుకానికి పాల్పడ్డ వాడికి బతికే హక్కు లేదని, నిందితుడికి మరణశిక్ష విధించాల్సిందేనని ఉజ్జయిని రేప్ కేసులో నిందితుడి తండ్రి రాజు సోని అన్నాడు. దేశం యావత్తు ఉలిక్కిపడిన ఈ ఘటనలో నిందితుడు ఆటో రిక్షా డ్రైవర్ భరత్ సోనిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితుడి తండ్రి రాజు సోని శనివారం మీడియాతో మాట్లాడుతూ, ‘అత్యంత హేయమైన దాడికి పాల్పడ్డవాడ్ని కఠినంగా శిక్షించాలి. వాడికి బతికే హక్కు లేదు. కాల్చిపారేయాలి. బాధితురాలి స్థానంలో నా కూతురున్నా ఇదే విషయం చెబుతాను’ అని అన్నాడు.
పోలీసులు వచ్చి భరత్‌ను అరెస్టు చేసే వరకు తనకు విషయం తెలియదన్నాడు. ‘ఉజ్జయినిలో రేప్ జరిగిందన్న వార్త ప్రస్తావిస్తే, ఏమీ తెలియనట్టు వ్యవహరించాడు. భరత్ ఈ నేరం చేశాడంటే నమ్మలేకున్నా’ అని వివరించాడు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అత్యంత అమానుష లైంగిక దాడి ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది. 12 ఏండ్ల బాలిక ఎంతోమందిని వేడుకున్నా, ఎవరూ ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాకపోవటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.