న్యూఢిల్లీ, జూలై 22: యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ తదితర సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ఒక సరికొత్త ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం సోమవారం లోక్సభలో వెల్లడించింది. ఇందుకోసం ‘భారత ఉన్నత విద్యా కమిషన్’ (హెచ్ఈసీఐ) అనే ముసాయిదా బిల్లును రూపొందించే ప్రక్రియలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఉన్నట్టు కేంద్రం తెలిపింది. కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత ఉన్నత విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడానికి ఒక బిల్లును రూపొందిస్తున్నామని, దీనిని ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థగా ప్రతిపాదించినట్టు కేంద్రమంత్రి అందులో పేర్కొన్నారు. ‘నియంత్రణ, అక్రిడిటేషన్, నిధులు, విద్యా ప్రమాణాల ఏర్పాటు మొదలైన విభిన్నమైన విధులను నిర్వహించడానికి భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. జాతీయ విద్యా విధానం-2020(ఎన్ఈపీ)లో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ స్థానంలో ‘హెచ్ఈసీఐ’ని ఎన్ఈపీ ప్రతిపాదించింది’ అని అన్నారు.