చెన్నై : సనాతన ధర్మాన్ని (Sanatana Row) నిర్మూలించాలన్న వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. బీజేపీ నేతలు తనపై దాఖలు చేస్తున్న కేసులు, ఫిర్యాదులను న్యాయపరంగా తాను ఎదుర్కొంటానని పేర్కొన్నారు. తనపై కాషాయ నేతల ఎదురుదాడి, కేసుల నమోదును ప్రస్తావిస్తూ బీజేపీ నేతల మనుగడ ఇదేనని, వారికి ఎలా ప్రజల్లో ఉండాలో తెలియదని మండిపడ్డారు.
తన తలపై రివార్డు ప్రకటించిన అయోధ్య ప్రధాన పూజారి ఉదంతంపై స్పందిస్తూ స్వామీజీల దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, కేసులు నమోదు చేయడం వంటివి చేయవద్దని డీఎంకే శ్రేణులను ఉదయనిధి స్టాలిన్ కోరారు. తనపై నమోదైన కేసులను తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. మణిపూర్లో చెలరేగిన ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, 7.5 లక్షల కోట్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మోదీతో పాటు మోదీ బృందం సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్లుగా చేసిందేమీ లేదు. కరెన్సీ నోట్ల ఉపసంహరణ, గుడిసెలు కనిపించకుండా గోడలు కట్టడం, నూతన పార్లమెంట్ భవనం నిర్మించడం, దేశం పేరు మార్పుపై హంగామా చేయడం మినహా మోదీ ప్రజల కోసం చేసిందేమీ లేదని ఉదయనిధి స్టాలిన్ దుయ్యబట్టారు.
Read More :