చెన్నై: సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పోల్చిన విషయం తెలిసిందే. ఆ కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే సనాతన ధర్మం వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని మోదీ తన సహచరులకు సూచించారు. దీంతో మంత్రి ఉదయనిధి తండ్రి అయిన తమిళనాడు సీఎం స్టాలిన్(CM Stalin) ఇవాళ స్పందించారు. ఓ భారీ లేఖను ఆయన రిలీజ్ చేశారు. సనాతన ధర్మంపై కొడుకు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఆయన మొదటిసారి మౌనం వీడారు. ఉదయనిధి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియకుండా ప్రధాని మోదీ మాట్లాడడం అన్యాయమని సీఎం స్టాలిన్ తెలిపారు.
షెడ్యూల్ కులాలు, తెగలు, మహిళలను కించపరిచే సనాతన సూత్రాల గురించి ఉదయనిధి కామెంట్ చేశారని, ఏ మతాన్ని కానీ, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో ఉదయనిధి మాట్లాడలేదని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అణిచివేత సూత్రాలతో వెళ్తున్న వారిని బీజేపీ మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నట్లు ఆయన విమర్శించారు. సనాతన ఆలోచనలతో ఉన్నవారిని తుదముట్టించాలని ఉదయనిధి పేర్కొన్నట్లు ప్రచారం చేస్తున్నారని, కానీ తన కుమారుడు అలాంటి వ్యాఖ్యలు ఏమీచేయలేదని సీఎం స్టాలిన్ తెలిపారు.
ఉదయనిధి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని తన మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చినట్లు జాతీయ మీడియా ద్వారా తెలిసిందని, ఇది తనను నిరుత్సాహపరిచిందన్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల గురించి సమగ్ర సమాచారాన్ని ప్రధాని మోదీ గ్రహించాలన్నారు. ఉదయనిధిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని సీఎం స్టాలిన్ తన లేఖలో కోరారు. ఒకే దేశం ఒకే ఎన్నిక.. ఓ రాజకీయ జిమ్మిక్కు అన్నారు. సనాతన ధర్మంలో ఉన్న అసమానతల్ని రూపుమాపే ధైర్యం బీజేపీకి లేదన్నారు.
On Tamil Nadu Minister Udhayanidhi Stalin's 'Sanatana Dharma should be eradicated', Tamil Nadu CM MK Stalin says "He expressed his views on Sanatan principles that discriminate against Scheduled Castes, Tribals, and Women, with no intention to offend any religion or religious… pic.twitter.com/pq2GP0esRp
— ANI (@ANI) September 7, 2023