Nikitha Godishala : హైదరాబాద్ యువతి గోడిశాల నిఖిత (Nikitha Godishala) ఇటీవల అమెరికాలో దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అనుమానితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ శర్మ (Arjun Sharma) ను ఇంటర్‌పోల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. అంతకుముందే అతడిపై అమెరికా పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు.
కాగా 27 ఏళ్ల నిఖిత అమెరికాలోని మేరీల్యాండ్‌లో అనుమానాస్పద రీతిలో మరణించింది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని జనవరి 3న అర్జున్ శర్మ అపార్టుమెంట్లో గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అర్జున్ శర్మనే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే నిఖిత అదృశ్యం అయ్యిందంటూ జనవరి 2న అర్జున్ శర్మ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేరోజున అతడు భారత్‌కు తిరిగి వచ్చినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. దాంతో అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తాజాగా ఇంటర్‌పోల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.