Adolescence | సినీ, వెబ్ కంటెంట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ వేడుక జనవరి 4న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘అడాల్సెన్స్’ అన్ని విభాగాల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుతూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం ఆరు నామినేషన్లు దక్కించుకున్న ఈ సిరీస్, వాటిలో నాలుగు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుని విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలను కూడా అందుకుంది. సామాజిక బాధ్యతతో కూడిన కథనం, బలమైన స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలను తాకే నటనతో రూపొందిన ‘అడాల్సెన్స్’ను ఉత్తమ సిరీస్‌గా క్రిటిక్స్ ఎంపిక చేశారు. సమకాలీన సమాజంలోని సున్నితమైన అంశాలను ఆవిష్కరించిన విధానం అవార్డు కమిటీని ఆకట్టుకుంది.
ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ గ్రాహం తన సహజమైన, ప్రభావవంతమైన నటనతో ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. అలాగే, భావోద్వేగాలతో నిండిన సహాయ పాత్రలో మెప్పించిన ఎరిన్ డోహెర్టీకి ఉత్తమ సహాయ నటిగా పురస్కారం లభించింది. అత్యంత విశేషంగా, ఈ సిరీస్‌లో నటించిన ఓవెన్ కూపర్ అతి చిన్న వయసులోనే ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకుని క్రిటిక్స్ ఛాయిస్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. అతడి నటన ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా కదిలించింది.
‘అడాల్సెన్స్’కు ఇది ఒక్కటే కాదు. ఇప్పటికే గతంలో జరిగిన 77వ ఎమ్మీ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అవార్డుల పరంగా మాత్రమే కాకుండా, కంటెంట్ నాణ్యతలోనూ ఈ సిరీస్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. గతేడాది మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘అడాల్సెన్స్’, విడుదలైన నాటి నుంచే భారీ వ్యూస్‌తో దూసుకెళ్లింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌ల జాబితాలో టాప్–10లో చోటు దక్కించుకుంది. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం, ఆన్లైన్ ట్రోలింగ్, డిజిటల్ ప్రపంచం వారి మనసులపై చూపే ప్రభావం వంటి అంశాలను ఈ సిరీస్ ప్రధానంగా ప్రస్తావించింది. 13 ఏళ్ల బాలుడు తన తోటి విద్యార్థినిని హత్య చేసిన సంఘటన నేపథ్యంలో కథను నిర్మించి, సమాజానికి ఆలోచింపజేసేలా ‘అడాల్సెన్స్’ను తెరకెక్కించారు.