ఖమ్మం రూరల్, జనవరి 05 : ఏదులాపురం మున్సిపాలిటీ రెండు సంవత్సరాల క్రితం 12 గ్రామాల సముదాయంతో ఏర్పాటైంది. వీటిలో సగం గ్రామాలు పూర్తి పల్లె ప్రాంతం కాగా మిగిలిన సగం సెమీ అర్బన్ ప్రాంతంగా ఉంది. పోలేపల్లి, ఏదులాపురం, పెద్దతండా పాత పంచాయతీల పరిధిలో అనేక కాలనీలు సంవత్సరాల క్రితమే ఏర్పాటు అయ్యాయి. ఏఎంసీలో మొత్తం 45 వేల జనాభా ఉంటే ఈ కాలనీలోనే సుమారు 60 శాతం మంది ఓటర్లు ఉన్నారు. అయితే అసలు చిక్కు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలో ఏర్పాటైన కాలనీ వాసుల్లో అనేకమంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఇక్కడికి వచ్చిన సమయంలో అప్పటికే వారి వారి ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడా తమకు ఓటు హక్కు ఉండాలని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు బదిలీ కాకుండా నూతన ఓటుకు దరఖాస్తు చేసుకోవడంతో వారికి సైతం ఓటు హక్కు వచ్చింది. దీంతో గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ఓటర్లు వారి పూర్వ ప్రాంతాల్లో, ప్రస్తుత నివాస ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇక్కడి ఓటర్లు దర్జాగా తమ ఓటు హక్కును వినియోగించుకుని మరోమారు మున్సిపాలిటీలో సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా స్థానిక యంత్రాంగానికి తెలిసినా, ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే తప్పా ఈ సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే మున్సిపల్ ఓటరు జాబితాకు సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేసిన ఈఎంసీ అధికారులు సోమవారం ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు ఈ ప్రస్తావనను అధికారుల ముందుకు తీసుకు వస్తారా లేదా పాత పద్ధతి లాగానే కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తారా వేచి చూడాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఒకే ప్రాంతంలో ఓటు హక్కు ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని మున్సిపల్ ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.