Unwanted Hair | శరీరంపై ఉండే వెంట్రుకలను అలాగే అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి మనం అనేక పద్దతులను పాటిస్తూ ఉంటాం. షేవింగ్, వ్యాక్సింగ్ లతో పాటు వెంట్రుకలను తొలగించే క్రీములను కూడా వాడుతూ ఉంటాం. ఇలా వెంట్రుకలను తొలగించే వివిధ పద్దతులు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పద్దతులను ఉపయోగించడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు, చర్మం ఎర్రగా మారడం అలాగే క్రీముల్లో ఉండే రసాయనాల వల్ల చర్మంపై పుండ్లు పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పద్దతులన్నీ కూడా అందరికీ సరిపడవని చెప్పవచ్చు. అయితే శరీరంపై ఉండే వెంట్రుకలను మనం కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాలన్నీ కూడా సహజసిద్దమైనవి. వీటిని వాడడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. పైగా చాలా సులభంగా, తక్కువ ఖర్చులో శరీరంపై ఉండే వెంట్రుకలను తొలగించుకోవచ్చు. శరీరంపై ఉండే వెంట్రుకలను తొలగించే ఇంటి చిట్కాల గురించి బ్యూటీ ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు.
శరీరంపై వెంట్రుకలను తొలగించుకోవాలనుకునే వారు ఒక గిన్నెలో పసుపు, పాలు వేసి గట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీనిని కావల్సిన ప్రాంతంలో శరీరంపై రాసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉండాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే వెంట్రుకలతో పాటు మురికి కూడా తొలగిపోతుంది. ఒక పాన్ లో చక్కెర, నిమ్మరసం సమానంగా వేసి కలుపుతూ వేడి చేయాలి. చక్కెర కరిగి బంగారు వర్ణం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని చర్మంపై వెంట్రుకలు పెరుగుతున్నదిశలో రాయాలి. తరువాత దీనిపై స్ట్రిప్స్ ను అతికించి వెంట్రుకలకు వ్యతిరేక దిశలో గట్టిగా కిందికి లాగాలి. ఇలా చేయడం వల్ల కూడా వెంట్రుకలు తొలగిపోతాయి.
బొప్పాయి పండును మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఇందులో పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను చర్మానికి రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది వెంట్రుకలు నిర్జీవంగా అయ్యేలా చేస్తుంది. కనుక వెంట్రుకలు సహజ సిద్దంగా తొలగిపోతాయి. అరటిపండులో ఓట్ మీల్ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత చర్మంపై రాసి వృత్తాకారంలో సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేసిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు తొలగిపోవడంతో పాటు చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.
అదే విధంగా మనం ఎంతో కాలంగా ఉపయోగిస్తున్న శనగపిండి మాస్క్ కూడా వెంట్రుకలను తొలగించడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో శనగపిండిని వేసి అందులో తగినంత పెరుగు వేసి గట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత చర్మంపై రాసి ఆరిపోయే వరకు ఉంచాలి. తరువాత వెంట్రుకలు పెరుగుతున్న దిశలో కాకుండా వాటికి వ్యతిరేక దిశలో స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు తొలగిపోతాయి. బొప్పాయి పండు గుజ్జులో కలబంద జెల్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి 20 నుండి 25 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా సహజ చిట్కాలను ఉపయోగించి కూడా మనం చాలా సులభంగా శరీరంపై ఉండే వెంట్రుకలను తొలగించుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది.