మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 25 సంవత్సరాల పాటు తాము పాలు పోసి పెంచితే.. ఆ పాము తమనే బుస కొడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయినా.. దానిని ఎలా చంపాలో తమకు బాగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. మహా వికాస్ అగాఢీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతల సమావేశంలో సీఎం ఉద్ధవ్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఎన్సీపీ అధినేత పవార్ కూడా హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్ ఈ భేటీ నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరు కావాలని సూచించారు.
ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో మహారాష్ట్రలో ఎన్నడూ ఇలాంటి కక్షసాధింపు చర్యలను చూడలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారు.