Uddhav Thackeray | శివసేన పార్టీతోపాటు గుర్తుపై సుప్రీంకోర్టులో కొట్లాడేందుకు ఉద్ధవ్ థాక్రే సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. ఇందుకోసం న్యాయనిపుణులతో ఆయన నిన్నంతా చర్చలు జరిపారు. కొద్దిసేపటి క్రితం కూడా తన వర్గానికి చెందిన సీనియర్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు, పార్టీ పేరు, గుర్తుల కేటాయింపులో పెద్ద మొత్తంలో బేరం కుదిరిందని ఆయన వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఈ విషయంలో సుప్రీంకోర్టులో షిండే (Shinde)వర్గం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని థాక్రే వర్గం సవాలు చేస్తే.. షిండే వర్గం వారి వాదనలు వినకుండా కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించకుండా ఉండేందుకు కేవియల్ పిటిషన్ ఉపయోగపడుతుందని షిండే వర్గం భావిస్తున్నది.
శివసేన (Shivasena) పార్టీ పేరు, గుర్తు విల్లు – బాణంపై ఏకనాథ్ షిండే చేసిన వాదనను ఎన్నికల సంఘం శనివారం క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టులో ఛాలేంజ్ చేయనున్నారు. ఈ విషయమై ఆదివారం ఉదయం నుంచి ఆయన న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. పార్టీని హైజాక్ చేసినంత మాత్రాన ఆ వర్గానికి ఎలా చెందుతుందని ఉద్ధవ్ వర్గం వాదిస్తున్నది. సుప్రీంకోర్టులో సవాల్ చేసి పార్టీ పేరుతోపాటు గుర్తును కూడా వారి నుంచి లాక్కోవాల్సిందే అన్న కృతనిశ్చయానికి ఉద్ధవ్ థాక్రే వచ్చినట్లుగా తెలుస్తున్నది. మరోవైపు తన వర్గానికి చెందిన సీనియర్ నాయకులతో తన ఇంటిలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
వీటన్నింటి మధ్య శివసేన పేరు, చిహ్నాన్ని వైరి వర్గం వారికి కేటాయించేందుకు పెద్ద మొత్తంలో బేరం కుదిరిందని థాక్రే వర్గం రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు రూ. 2000 కోట్లు చేతులు మారి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వందల కోట్లు ఖర్చు చేసినప్పుడు.. పార్టీ పేరు, చిహ్నం కోసం ఎంతైనా ఖర్చు చేస్తారని ఆరోపించారు. ఎవరు సత్యాన్ని కొన్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయిస్తారని, శివసేన ఎవరిదనే నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రజలే తేలుస్తారని చెప్పారు.