Uddhav Thackeray | మహారాష్ట్రలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో చీలికల రెండు వర్గాలుగా వీడిపోయాయి. ఇటీవల రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ నేత శరద్ పవార్‌పై ఆయన అన్న కొడుకు తిరుగుబావుటా ఎగురవేసి.. బీజేపీతో జతకట్టి మంత్రివర్గంలో చేరారు. జులై 2న ఎన్డీయే ప్రభుత్వంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అజిత్ పవార్‌కు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. మరో వైపు శివసేన చీలికల నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతో పాటు ఉద్ధవ్ వర్గానికి సైతం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సమాధానం ఇచ్చేందుకు 15 రోజులు గడువు ఇచ్చారు. ఓ వైపు ఎన్సీపీలో చీలికలు, మరో వైపు అసెంబ్లీ స్పీకర్ నోటీసుల నేపథ్యంలో రాజకీయాలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. కొత్త గందరగోళాన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలన్నారు. నోటీసులపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని, అనర్హత పిటిషన్‌ను పక్కనపెడితే సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. విదర్భ ప్రాంతంలో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో నాగ్‌పూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు స్పందిస్తూ.. బీజేపీకి అనర్హతపై మాట్లాడే అర్హత లేదని తాను భావిస్తున్నానన్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేన కార్యకర్తల్లో మనోధైర్యం పెంచేందుకు ఆయన రెండు రోజులు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నాగ్‌పూర్‌కు చేరుకున్నారు. విదర్భ ప్రాంతంలోని యవత్మాల్, వాషిమ్, అమరావతి, అకోలా, నాగ్‌పూర్‌కు చెందిన పార్టీ క్యాడర్, మద్దతుదారులతో చర్చలు జరుపనున్నారు.