Maharashtra Assembly Elections : ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష మహా వికాస్ అఘాది (ఎంవీఏ) సన్నద్ధమవుతున్నది. ఏక్నాథ్ షిండే సర్కార్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్ధిని ప్రకటించి ఆపై ప్రచారానికి శ్రీకారం చుట్టాలని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విపక్ష కూటమికి పిలుపు ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ ప్రకటించే సీఎం అభ్యర్ధికి తమ పార్టీ భేషరతుగా మద్దతు ఇస్తుందని ఠాక్రే స్పష్టం చేశారు. ఎంవీఏ సమావేశంలో ఠాక్రే ఈ విషయాన్ని నొక్కిచెప్పారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో ఎంవీఏ పోరాడుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎంవీఏ సీఎం అభ్యర్ధిని ప్రకటించాలని, పృధ్వీరాజ్ ఛవాన్ లేదా శరద్ పవార్ సీఎం పదవికి వారి ప్రతిపాదనను ప్రకటిస్తే వారికి తాము భేషరతుగా మద్దతిస్తామని ఠాక్రే స్పష్టం చేశారు.
అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి సీఎం అభ్యర్ధిని ప్రకటించాలనే పద్ధతిని గతం నుంచి అనుసరించడం జరుగుతున్నదని చెప్పారు. గత కూటముల్లోనూ తాము ఇదే ఫార్ములా అనుసరించామని గుర్తుచేశారు. పార్టీ గుర్తును ఏక్నాథ్ షిండే శివసేన దక్కించుకోవడంపై ఠాక్రే స్పందిస్తూ వారు నా ‘విల్లుబాణం’ చిహ్నాన్ని దొంగిలించినా, నేను వారి వెన్నులో మంట పెట్టడానికి ‘లైటింగ్ టార్చ్’ని గుర్తుగా తీసుకున్నానని చెప్పారు.
Read More :
SBI | వరుసగా మూడో నెల.. వడ్డీరేట్లను పెంచిన ఎస్బీఐ