SBI | ముంబై, ఆగస్టు 15: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్లను పెంచింది. అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. పెరిగిన వడ్డీరేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా బ్యాంక్ స్పష్టం చేసింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలు ప్రియం కానున్నాయి. వీటి ఈఎంఐలు మరింత భారమైపోతున్నాయి.
అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్ల నిర్ణయానికి ఎంసీఎల్ఆర్నే ప్రామాణికంగా బ్యాంకులు తీసుకుంటున్నాయిప్పుడు. ఫలితంగా ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు పెంచిన ప్రతీసారీ రుణగ్రహీతలు తమ నెలవారీ కిస్తీలను ఇంకా ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నది. లేదంటే రుణ కాలపరిమితైనా పెరుగుతున్నది. నిజానికి ఇలా వడ్డీరేట్లను ఎస్బీఐ పెంచడం వరుసగా ఇది మూడో నెల కావడం గమనార్హం. ఇతర పోటీ బ్యాంకులూ వడ్డీరేట్లను పెంచుతుండగా.. ఈ తరహా విధానాలు మార్కెట్లో రుణ లభ్యతను కఠినతరం చేస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను ఏడాదిన్నరగా యథాతథంగానే ఉంచుతున్నది. వరుసగా రెపో రేటును పెంచుతూపోయిన ఆర్బీఐ.. గత ఏడాది ఫిబ్రవరిలో చివరిసారిగా పెంచింది. 6.25 శాతం నుంచి 6.50 శాతానికి తీసుకెళ్లింది. అప్పట్నుంచి ఇప్పటిదాకా అదే వడ్డీరేటు నడుస్తున్నది. రెండు నెలలకోసారి ద్రవ్య విధాన పరపతి సమీక్షలు చేస్తున్నా.. ద్రవ్యోల్బణం అదుపు సాకుతో వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే సమావేశాన్ని ముగించేస్తున్నది. అయితే బ్యాంకులు మాత్రం రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూనే ఉన్నాయి. ఈ నెల 12 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్లు రుణాలపై వడ్డీరేట్లను పెంచగా.. ఆగస్టు 10 నుంచే యూకో బ్యాంక్ పెంచేసింది. తాజాగా పంద్రాగస్టు సందర్భంగా ఎస్బీఐ వడ్డించింది. బ్యాంకుల తీరు.. తమకు ఇబ్బందికరంగా ఉంటున్నదని ఆటో, నిర్మాణ, దాని అనుబంధ రంగాలు వాపోతున్నాయి. ఇకనైనా రెపో రేటును ఆర్బీఐ తగ్గించాలని, అప్పుడు బ్యాంకులూ వడ్డీరేట్లను తగ్గిస్తాయని అటు వ్యాపారులు, ఇటు రుణగ్రహీతలు అంటున్నారు.